Monday, April 9, 2018

జంటకవి మిత్రులు::


జంట కవి మిత్రులు
మచ్చ లక్ష్మయ్య
భువనగిరి


నాగిళ్ళ బాబయ్య గుప్త
నివాసం : భువనగిరి

జంటకవి మిత్రులు::
ఇద్దరి పురుటి గడ్డ ఒక్కటే•••కాటెపల్లి గ్రామం
వీరిద్దరు పదవ తరగతి వరకు చదువుకున్నది
ఒకే బడి "జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల చాడ" నల్లగొండ జిల్లా. ప్రస్తుతం యాదాద్రి జిల్లా. 
వీరు ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే
వారిలో సాహిత్య అభిలాష ఆసక్తి బీజాలు
అంకురించినాయి. 
ఈ ఇద్దరు బాల్యమిత్రులు--నాగిళ్లబాబయ్యగుప్త 
మచ్చ లక్ష్మయ్య. ఉన్నత పాఠశాల విద్యపిదప
వీరి జీవన గమనం మారింది. 
   బాబయ్యగుప్త తల్లితండ్రులుకిరాణ దుకాణం
లో కూర్చుండి వృత్తిపని నేర్చుకొమ్నని బలవంత
పెట్టినారు కాని వృత్తిమీద ఆసక్తి చూపలేదు
మనసునందలి సాహిత్యాభిమాన ప్రేరణతో 
జడ పెద్దల మాటలను లక్ష్యపెట్టక సారస్వత  పరిష                      
త్తు హైదరా బాదులోచేరి తెలుగు B.0.L పట్టా
1974సం.లోపొందిన పిదప తెలుగుపండితజ
శిక్షణానంతరం 1979సం.లో ప్రభుత్వ ప్రాథమి
కోన్నత పాఠశాల బాగాయత్ భువనగిరి లో
 జూనియర్ తెలుగు పండితునిగా ఉపాద్యాయ
వృత్తిలో జీవనయానం సాగింది. 
      మచ్చ లక్ష్మయ్య కుటుంబపరిస్థితి అస్తవ్యస్త ముగా వుండటంవలన బ్రతుకుదెరువు
బొంబాయి (ముంబాయి)కివెళ్లి అక్కడ నేతకార్మి
కునిగా తమ వృత్తినికొనసాగించినాడుద. నేత
మగ్గాలనునడుపుతూ నేత బిడ్డల నిజపరిస్థితి
ని నెమరుకు తెచ్చుకొంటున్నాడు. సాహిత్యాభి
మాని కాబట్టితీరిక సమయాన్ని కూడ వృధా 
కచేయక వివిధ గ్రంథాలను అధ్యయనంచేయ
టమే కాక వ్యాకరణం మీద పట్టు సాదించాడు. 
అమరకోశం వంటి గ్రంథరాజాలను శ్రద్ధతో
చదివి సాహిత్యం మీదకొంతపట్టుసాధించిన
సాహితీ కృషీవలుడైనాడు.ఇంకా వైద్య సం
బంధ D.M.L.కామర్స్ లోడిప్లొమాపొందినాడు
తనలోనిసాహిత్య ప్రవాహాన్ని ఆపలేక బొంబా
యి లోనే1976సం.లోనేత పనివారలఇక్కట్ల
గురించి వారి ప్రతిభను తెలియ జేసేపద్యాలను
ఛందోబద్దంగా పాఠకులకు సులభంగా అర్థమ
య్యె రీతిలో చక్కని చిక్కనిశైలిలో వ్రాసి తన
ప్రతిభను చాటుకున్నాడు. కొంత కాలం పిదప
బొంబాయి నుంచి సొంత ఊరుకు చేరి కొన్ని
నెలల తరువాత భువనగిరిలో పాథాలోజికల్
లాబ్ పెట్టి వైద్య సేవలనందించినాడు. 
భువనగిరిలో వుంటున్న బాల్యమిత్రులు 
ఇద్దరు కలిసికున్నారు. యవదశలో ఇద్దరి
మిత్రుల స్నేహలతపల్లవించి మొగ్గదొడిగి పుష్పించి సాహితీ సౌరభాన్ని ప్రసరించింది. 
వీరు సాహితీ సభలలో పాల్గొనడానికి ఉత్సు
కత కనపరచె వారు కాదు. తీరిక సమయాల్లో
సాహితీ ముచ్చట్లు చెప్పుకొనేవారు. వీరు శతకం
వ్రాయాలనే తలంపుతో సంవత్సరకాలం శ్రమిం 
చి సామాజిక అధ్యాత్మికసందేశాత్మిక పద్యరచ
నలు చేసి మొదట "మిత్రశతకము "తదుపరి 
"శ్రీ సాయినాథ శతకము"వేంకటేశ్వర శతకము"
రాసి అభిప్రాయాల కోసం సాహితీ మిత్రులకు
పంపినారు. ముద్రణ ప్రయత్నంలో వుండగా
చిన్న చిన్న అవంతకారణాలవల్ల ముద్రణ సమయం మార్చవలసివచ్చింది. 
ఊహించని పరిణామం ! కరుణలేనికాలం
ఒకే సంవత్సరంలో (2015)ఆలోకనుంచి
వేరుచేసింది. కుటుంబాల్లో మిత్రబృందంలో 
అభిమానుల్లోఆత్మీయుల్లో విషాదంనింపింది
జంట కవి మిత్రులు .......
మచ్చ లక్ష్మయ్య    నాగిళ్లబాబయ్యగుప్త 
వారుభౌతికంగా లేకున్నా వారు రాసిన
శతకాలలో చిరంజీవులుగా వున్నారు. 
వారి ఆశయ సాహితీ కృతులు వృధా
కాకుండా కవిమిత్రులజ్ఞాపకార్థ చిహ్నం
గా వుండి వారి ఆత్మలకు శాంతి
కలిగించునని భావిస్తున్నాను. 
 ఈశతకాలు వీరిని చిరస్మరణీయులుగ
నిలిపి వారి కుటుంబాలకు ప్రశాంత
జీవనం ప్రసాదించాలని శారదమాతను 
నిండు మనస్సుతో వేడుకుందాం. 
జంట కవి మిత్రులకు అక్షర శ్రద్ధాంజలి
ఘటిస్తూ............
                          ఆత్మీయ
                 లెక్కల మల్లా రెడ్డి 
                 విశ్రాంత ఉపాద్యాయుడు 
                సైదాపురం యాదాద్రి.



Sunday, April 1, 2018

మిత్ర శతకము

జంటకవి మిత్రులు నాగిళ్ల బాబయ్య గుప్త,
విశ్రాంత తెలుగు ఉపాద్యాయుడు,
మరియు
మచ్చ లక్ష్మయ్య గారు, మెడికల్ లాబ్,
స్వగ్రామం కాటెపల్లి,

వీరు ఇద్దరు కలిసి రచించిన మిత్ర శతకము లోని పద్యాలను బ్లాగు రూపంలో అందిస్తున్నాము...

ఈ కవివర్యులు వెలుగులోనికి రాకముందే 2015లో లోకం విడిచి వెళ్లి పోయినారు.

వారిపై ప్రేమతో శ్రీ లెక్కల మల్లారెడ్డి గారు సేకరించి అందించిన శతక పద్యాలు...
మిత్ర శతకము.

1.
శ్రీలలరారు భారతధరిత్రి అహింస దయాది శాంతి' స
త్యాలకు ఆలవాలమయిధర్మము చాగము' నీతి నీమముల్
చాలగచాలగన్ గలిగి సన్నుతికెక్కిన మాతృమూర్తి  పా
దాలకువందనంబులు సదామము బ్రోచు నటంచు మిత్రమా !

2
భారముకావు కష్టములు భారము గాదు విచార మనం తగు
భారముగావు నిందలును భారము పేదతనంబు కాదుగా
భారములన్ని దీర్చగ ప్రభాతము నందున విఘ్నరాజునే
కోరియర్ పూజసేయుదుమకుంఠితదీక్షను బూని మిత్రమా!

3
రచనలు సేతుమెన్నియొవిరామములేక భవత్కృపాబ్ధి స
ద్వచనములిచ్చుచుండియు ప్రవాహములా పరుగెత్తునట్టిమా
వచనములంజగత్తుపయిభాసిలజేయగ నీ కటాక్షమున్
సుచరిత సత్కళల్ గురియచూపుము శారద నీవె మిత్రమా !

4
తల్లియుదండ్రియున్ గురువుదైవ సమానులులోకమందువా
రుల్లసిలంగ మెల్గుదురురూపము దీపము శ్రీ కటాక్ష  సం
పుల్ల ప్రపుల్లమానవ ప్రబోధమునందున నిల్చి నిల్చి  మీ
చల్లని చూపులన్ని వెదజల్లుడికావ్య మునిండ మిత్రమా!

5.
దేశముకోసమై కఠినదీక్షబూనిన దేశభక్తులీ
దేశముకోసమై భరతదేశము నైక్యజేసి సాగగా
ఆశలుసన్నగిల్లి భయమందిన శత్రులు పారిపోయిరే
దేశముసాటిరాదు బహుదేశము లెన్నియునున్నమిత్రమా

6.శంకలువీడు సజ్జనుల సన్నుతికెక్కిన చేష్టలందు  యే
శంకయువద్దు పూజ్యమగు శాస్త్రములందున వద్దువద్దుయే
శంక సుమిత్రులందున విశాలముగన్ పరికించిచూడ యే
శంక పవిత్రనాయకుల సచ్చరితంబున వద్దు   మిత్రమా !

7.
ఇయ్యవి బాల్యమిత్రులముయింపుగ నుండగ వ్రాసినాము ల
క్ష్మయ్యయు పూని మిత్రశతకంబును మైత్రికి గుర్తుగాను బా
బయ్యయు లోకమందుగల పాడియు నైతికవిల్వలెన్నియో
చయ్యన పద్యరూపమునశారదయేదయజూపగ మిత్రమా!

8.
చీకటిబాపి వెల్గులనుజేర్చియుమిక్కిలి పాడిపంటలన్
లోకమునందు నుండ జనులున్ఖ సుమందెరు లోకబాంధవా
ప్రాకటమైన యీకృతిని భక్తిగఅంకిత మిచ్చినామయా
గైకొనుమయ్య మిత్రశతకంబును ప్రీతిగా నీవె మిత్రమా.

9.
తీయనిభాషరా తెలుగు తిక్కననన్నయ ఎర్రనాదులా
ప్యాయత నింపినారు మకరందమురమ్యత ఇంపు సొంపు లౌ
సోయగముల్భేగ చవిచూసియు తన్మయులయ్యిరే విదే
శీయులు సైతమున్ మనసు చేర్చుము నీవునుగ్రోల మిత్రమా!

10.
అన్నియునున్న నన్నయ మహా త్ములుతిక్కనఎర్రనార్యులే
సన్నుతికెక్క భారతము సత్కృతి  జేసిరిగా యిలాతలం
బెన్నడు మర్వబోదుగద ప్రీతిని నీతి ని గల్గజేయు  ఏ
మన్నను భారతంబుకడుమన్నన  పొందగజేయుమిత్రమా

11.
చేతనగల్గజేసి మనజీవనమెంతయొ చక్కదిద్దుచున్
ప్రీతిని పెంచుచుండు మనపెన్నిధి భాగవతంబువ్రాసియున్
పోతన యిచ్చెరా మనకుపుణ్యుడుధన్యుడుయైన ఆతనీ
ఖ్యాతి జగంబునందుకలకాలము నిల్చుగదయ్యమిత్రమా!

12.
పేరుప్రతిష్ఠలున్న మనపెద్దనధూర్జటి భట్టుమూర్తి ఇం
పారగ రామభద్రకవి మాన్యుడుమాదయగారి మల్లనన్
ధీరుడు రామకృష్ణ కవి తిమ్మనపింగళిసూరనాఖ్యులౌ
వీరినె అష్టదిగ్గజ కవీశ్వరులందు రటయ్య మిత్రమా!

13.
తేనెయుతాక నోరు బహుతీపిని  పొందువిధమ్మునుండగా
పూనియు నీతిపద్యములు పొంపిరి వోవగ వ్రాసినాము మీ
మానసమందు నిల్వగల మంచిని తెల్పునటంచునెంచి ఆ
హ్వానము మీకిదే చదువమంచును పద్యములన్ని మిత్రమా

14.
హాసము ఏలనోయి? ప్రతి అక్షరమున్ ఒకఆయుధమ్ముగా
చేసి ధరిత్రిపైనగలచేటునునుక్కడ గింపబూనియున్
వ్రాసితిమోయి పద్యములు వాస్తవమేయిది మాదు ఆశనే
భాసిలజేయుమయ్య అదె భాగ్యముమాకునటయ్య మిత్రమా !

15.
మల్లియవై ధరాతలమున మాన  వులన్ మురిపించకున్న ఓ
చల్లని గాలివై పరవశంబును సేయకనున్న వర్షపుం
జల్లువుయయ్యి హాలికుల చాలగ  సంతసపెట్టకున్న ఓ
పల్లెరుగాయవై ప్రజను బాధలు పెట్టకుమోయి మిత్రమా!

16.
టక్కలువద్దు జీవితముడబ్బుల  కోసమెగాదుఆస్తులెం
తెక్కువ కూర్చినన్ యవియుతెచ్చునె పుణ్యము లేనివారికిన్
మక్కువతోడ సాయపడ మాన్యుడ  వౌదువు నీదుకీర్తియే
చక్కగవెల్గిలోకమున సన్నుతికెక్కు దువయ్య మిత్రమా!1

17.
బ్రతుకుటకోసమే తినుము బాధలు ఎన్నియు వచ్చియున్నస
సత్పథమును తప్పబోకుము సదాని రుపేదల బాధ దీర్చుచున్
కుతుకమునింపుమా తినుటకోసమే గాదుగ జీవితంబు నీ
బ్రతుకుయె సార్ధకంబునగుబాద్యత మాత్రము నీదెమిత్రమా !

18:
ఏనిమిషంబునైన వృధనెప్పుడు సేయకు తోటివారలన్
తానను కొంచుఎంచమనధర్మము కష్టసుఖంబులందు ఏ
కానికి ఆశజెందకను కష్టమునైన భరించి ఎంచుమా
మానవసేవయే మనకు మాధవసేవయటంచు మిత్రమా!

19.
అన్నములేక కొందరునుఆకలితోకృశించుచుండ రై
తన్నలు పంటపండకను దారుణబాధల మున్గియుండ ఆ
పన్నులుగోడుగోడుననపారము కష్టములొందియుండ సం
పన్నులు సేయు డిన్నరుదుబారగు ఖర్చులుమాన్పుమిత్రమా!

20.
తరువులుకూల్చవద్దు అవి తల్లినిబోలిన ప్రేమమూర్తు  లై
కరువును పారద్రోలుగద కాయలుపండ్లును పూలనిచ్చుచున్
కురియగజేయు వర్షములు కూర్చు ధరిత్రికి సంతసంబు ఆ
తరువులె ప్రాణికోటికినిదైవసమానములయ్య మిత్రమా!

21.
కూ!యని కూసెడీ మధురకోకిలగా నపు తీపి కొక్కరో
కోయను నిద్రలేపు తమకూతల తోడను కాలజ్ఞానులం
బాయని లేగలేసి చను పర్వులతీరుజనాళిలోన నా
ప్యాయత పట్టుగొమ్మలగు పల్లెలలోనను నుండుమిత్రమా!

22.
ధనమునకాశ జెందవు సదా కలి సుండియుప్రేమ పంచుచున్
తినుగద హాయిగాను పలుతీరుల పక్షులు జంతుజాలమున్
మనమున ఎంచబోవుగద మాట కునైనను చిన్న పెద్దనిన్
మనజులకేల వైరమది మంచికి  మాత్రముకాదు మిత్రమా !

23.
మంచిని చేయబూను ప్రతి మర్త్యునికెప్పుడు తోడునిల్వు ఏ
వంచనచేయబోకు విధి వంచితు లైనటువంటి వారికి
పంచుము ప్రేమ అందుకొని బాధ లు బాపుమునీదు జన్మమే
ఎంచగ సార్థకంబగును ఎవ్వరు ఏమియునన్న మిత్రమా !

24.
కోపము కొంపగూల్చుఅనుకూలుర దూరముసేయుచుండుసం
తాపము గల్గజేయును ప్రతాపము  జూపియు ఆప్తులందరిన్
బాపును కృంగదీయును విపత్తులు  గల్గజేయునందుకే
కోపముమాని శాంతమును  కోరి వహించుటమేలుమిత్రమా!

25.
జీవితమంటె డబ్బు పరజీవులహింసయు జూదమాడు దు
ర్భావన వంచనల్ కుఠిలపద్ధతి  త్రాగుడు ఏదికాదు ఆ
జీవితమొక్క జీవితమె!జీవికి శాశ్వ తమైనయట్టి స
ద్భావన  శాంతి భూతదయ ధర్మ ప్రవర్తన గాదె మిత్రమా!

26.
దోహదమౌను వృద్ధికిని దూరము సేయునుదు:ఖమున్నప్రో
త్సాహమునిచ్చు మంచికినితప్పులుచేసినమందలించు నీ
తాహతుతెల్పుచుండియు సదాకలిసుండు పవత్రమైన ఆ
స్నేహముకన్నమించినది సృష్టిన ఏదియు లేదుమిత్రమా!

27.
అక్కరకొచ్చుచుట్టము కృపాత్ములునైనటువంటివిత్రులున్
మిక్కిలిప్రేమతో ధనప్రమేయము  లేనటువంటిబంధువుల్
చక్కనిమార్గదర్శకులు సంస్కృతి  సభ్యత నేర్పు గుర్వులున్
ఎక్కడనున్నచేరవలె ఎవ్విధమైన ను నీవు మిత్రమా!

28.
బాకుతుపాకులేల అణుబాంబు   బల్లెములేల?మానవుల్
ఏకముయై నిలంబడిన ఎన్నొఫిరం  గులుశృంగభంగమై
పోక మనంగయుండునటె?భూత లి శాంతముతోడనున్న ఏ
నాకము దీనికిన్ సమమౌనటె ఎంచియు చూడమిత్రమా!

29.
నాశముజేయు కొంపలనునమ్మ కమున్ సడలంగజేయుగా
నాశముజేయు గౌరవమునాశము జేయు ధనంబుఆస్తులున్
నాశముజేయు సర్వమునునాశము జేయును అన్నిరీతులన్
నాశముజేయు మద్యమును నమ్మక దూరమునుంచుమిత్రమా!

30.
మానవా!మానవామధువు మానముప్రాణసమానమైన వి
శ్వానను దుర్గుణంబుయిదిశాంత ముతో గమనించిమెల్గుటే
మానవజాతి కంతకునుమంచియె కల్గును లేకపోయినన్
మనము ప్రాణమున్ ధనముమాయ ముయౌనుగదయ్యమిత్రమా!

31.
వాగుచు బాధపెట్టు తనవారల మద్యముత్రాగి ఆస్తులన్
త్రాగుట కోసమమ్ము అతితక్కువరేటుకు గౌరవంబునే
త్రాగిన పోవుచుండుగద ధర్మముతప్పెడునట్లుసేయుఆ
త్రాగుడు మానుటేనరులధర్మమటంచునుతెల్పు మిత్రమా !

32.
భానునిబోలియున్ గురువు బాధ్యతతోడను భావిపౌరులన్
పూనియు జ్ఞానవంతులగు బుద్ధులునేర్పియు దేశభక్తినే
మానస మందు నింపి మనమన్ననలెన్నియొ పొందునట్టిలో
కానికి పూజ్యుడౌ గురువుగారికి వందనమయ్య మిత్రమా !

33.
నడిపెడువాడు దక్షుడునునయ్యిన  దేశము సంస్థ ఇల్లుయున్
బడియును కోవెలైననునపారము వృద్ధిని పొందుచుండు ఏ
ఇడుములు కల్గకుండ జనమెంతయొ హాయినికల్గియుండు ఆ
నడిపెడివాడయోగ్యుడవ నాశమెకల్గుచునుండు మిత్రమా !

34.
ఒక్కరికష్టమెప్పుడు మరొక్కరిహాయియు కాక యుండి  వే
రొక్కరి కష్టమెన్నడు మరొక్కరిరొక్కము కాకయుండుటల్
చక్కనిలోకరీతియిది సద్గుణవంతుల లక్షణంబు ఏ
తక్కెడలోనతూచవసుదైక కుటుంబమెయౌను మిత్రమా !

35.
దేవునికెంత మొక్కినను దీక్షగ పూజలు ఎన్నిచేసినన్
కోవెలలెన్ని కట్టినను కొబ్బరికాయలు కోట్లుకొట్టినన్
లావుగ అన్నవస్త్ర్రములు లక్షలు దానము చేసియున్న స
ద్భావనలేని జీవితము ధన్యముకాదది చూడ మిత్రమా !

36.
భాగ్యమదెంత యున్న పలుభాషల పాండుతిదండిగున్న వై
రాగ్యమునొందియున్న పలురత్నములున్నను రాజ్యమేలినన్
యోగ్యములైన వస్తువుల యోగము నున్నను ఆప్తులున్న ఆ
రోగ్యము లేనిజీవితము రూపము అంతవృథాయె మిత్రమా !

37.
ముదుసలి గంపనెత్తుకొని మూల్గుచునైనను కూరలమ్ము ఓ
ముదుసలివాడుదేవళముముందర కొబ్బరికాయలమ్ము ఓ
ముదుసలి బుట్టపట్టుకొని ముచ్చటతీరగ పూలనమ్ము ఆ
పదుగురె మార్గదర్శకము పాపికి సోమరికైన మిత్రమా !

38
ఆర్యులమాటలన్ వినక అల్లరివపిల్లల మైత్రి జేసి స
త్కార్యములెంచకుండను వికారపుమద్యము గుట్కలేసి దు
ష్కార్యము లెన్నొ చేయుచు సద్గుణాన్ని ఏదిలేక  ని
ర్వీర్యమునైరికొందరును రీతి యిదామరి చూడ మిత్రమా !

 39.
చదువుల్ నేర్తురటంచునెంచి పలు ఆశల్ పెంచి పంపించగా
మదమున్ బొందియు తోటి వారలనకన్ ర్యాగింగులే సేయగా
ఎదలున్ తల్లడిలంగచచ్చిరిగ వారే కారణంబాయెగా
అదియా మానవతంబు ? మాన్పుమిక ఆ ర్యాంగింగులన్ మిత్రమా !

40.
పుట్టిన ప్రాణులన్ని చనిపోవక తప్పదు పోవునాడు రా
దెట్టియునైన వెంట మరి దీనిని అందరుతెల్సి ఎన్ని ఇ
క్కట్టులనొందినా కలతకన్పడనీయక మేలుసేయగా
గట్టిగపూనుకొన్న కలకాలము నిల్చును కీర్తి మిత్రమా !

41.
స్వార్థమునిండిపోయె ప్రతివానమనస్సునదానిమూలమే
అర్థముకోసమై అతడు ఆడెడి బూటకపునాటకాలు తత్
స్వార్థమదంబణచినను సాగెడుచక్కనిజీవయాత్రలో
దుర్దశలుండవెక్కడను దోషములేవియులేక మిత్రమా !

42.
ధనము బలంబుగల్గెనను దర్పముఎందుకు?కోడిపిల్లనో
క్షణమున గద్ద తన్నుకొని కాటికి పంపువిధాన మృత్యువీ
మనుషుల ప్రాణముల్ నిల నమాంతము తీయగ పొంచియుండె యీ
ఘనమగుసత్యమున్ దెలిసి గర్వమువీడియు మెల్గు మిత్రమా !

43.
నడిచియు వెళ్లజాలడు వినాయకునట్లుగ బొజ్జ ఒంటికిన్
పడదుగ సబ్బు అన్నమును పాలుఫలంబులుగూడ హాయిగా
గడపని వానికెంతగను కార్లు విమానములాస్తులనండినన్
అడవినిగాచు వెన్నెలయుయౌగదనేమిఫలబు మిత్రమా !

44.
క్యాన్ససరుగల్గజేసి కలకాలము బాధలుబెట్టి ప్రాణమున్
క్యాన్ససలుచేయునట్టిది వికారపు పానుపరాగు గుట్కలే
ఛాన్సుయులేదు మానక విచారము ఎందులకోయి తెల్పు నీ
ఆన్సరు బాధ గల్గినను హాయిగ జీవితముండు మిత్రమా !

45.
క్షణికములౌసుఖంబు కలకాలమునుండెడిరీతిదల్చి ఓ
క్షణమును ఆగలేక పరకాంతల పొందునుగోరిసేయ త
క్షణమె ఎయిడ్సుసోకియు విచారముగా బ్రతుకంతకందియున్
క్షణమెకరీతి బాధపడు కాలము వచ్చునుచూడు మిత్రమా !

46.
ఉన్నతమైన సంస్కృతులనూడ్చియు డబ్బు దురాశ హెచ్చియున్
ఎన్నగ కొంతమందియునుఏహ్యమునయ్యిన వస్త్రధారణల్
పిన్నలు వృద్ధులందునను ప్రేమను కామము పుట్టజేసెనే
మన్ననలేని చేష్టలవమానము జాతికి గాదె మిత్రమా !

47.
జాతికి మూలకంబములు జాగృతి చేసెడి వారుగుర్వులే
నీతి విధేయతల్ వినయ నీమము జ్ఞానముగల్గజేసి యీ
జాతిని తీర్చిదిద్దగల సద్గుణమూర్తుల కొంతమంది ని
ర్మాతలు తీసినారు సినిమాలు ప్రతిష్టనుగూల్చ మిత్రమా !

48.
రైతులఆత్మహత్యలు కిరాయి మనుష్యులదుండగాలు ఏ
భీతియులేని నాయకులు పేదరికంబును చూడనట్టి దు
ర్నీతుల పాలసీలు పలురీతుల మోసములున్ కుయుక్తులున్
భూతలమందుసాగెను ప్రభూ యిదిఘోరముగాదె?మిత్రమా!

49
స్వామిటుచూడు చట్టసభ సభ్యులునయ్యుయు ఓట్లువేయగా
ఏమవి కాలిపోయెగద ఎంతటి దుర్దశ వచ్చె దేశ మిం
కేమియు యౌనొ?యీ ప్రజల నేలెడు వారలు యిట్టులుండగా
ఏమభివృద్ధి యౌను?ప్రజలకెట్లుగ మేలుగల్గు మిత్రమా !

50.
తమఋణబాధహెచ్చి తమదంతయుబోవగజీవితంబెశూ
న్యముయనిదల్చి ఆదుకొనుఆప్తులు లేకను తిండికెండి జీ
వములను నిల్పగాను పసివారలనమ్మిరి పేదరికమే
మమతను మానవత్వమును మాయముజేసెగదయ్య మిత్రమా !

51.
కూలికివెళ్లి జీతములకుండియు బిక్షముయెత్తి చెత్త కుం
డీలలొ చిత్తుకాగితములేరుచు తిర్గుచు టీలనమ్మెడీ
బాలురు విద్యలేక పలుబాధలనొందియు భావిపౌరులౌ
వేళన దేశమెట్లుగను వృద్ధిని పొందునొ చూడ మిత్రమా !

52.
పాలితులైనవారు పరిపాలకులున్ మనభారతీయు లౌ
వేళనకూడ దేశమున పేద మరింతగపేదయై స్వలా
భాలకు ఆశజెంది ధనవంతులుయింక ధనాఢ్యులయ్యెడీ
పాలన సాగుచుండె ప్రజలబాధలనేకమునొంద మిత్రమా !

53.
కట్నమువద్దు వద్దనుచు కైతలురాసి యుపన్యసించుచున్
కట్నము కోరుటే సబబుగాదని చట్టపరంగ తప్పనిన్
కట్నముపొందుటల్  సరియుగాదని వాదనచేసిచేసి ఆ
కట్నము కోసమైసతుల కాల్చిరి కూల్చిరి వారు మిత్రమా !

54.
వనరులనేకమున్న విషపాలన నిత్యము దాపురించి ఈ
జనమునకన్నికష్టములె సాగుకు త్రాగనుకూడ నీరులే
కనుపెనుబాధ గల్గి కలికాలమటంచును కృంగుపేదకే
మనుగడలేకయున్ నరకమయ్యెను జీవిత మంత మిత్రమా !

55.
కావలెనేడు పేదప్రజ కష్టసుఖంబులు దెల్సి బాధలన్
పోవగనేలుపాలకులు పోకిరిచేష్టలనుండిరక్షణన్
కావలెనేడుఅందరికి కర్షక కార్మిక కూలినాలికిన్
కావలెచేతినిండ పని లభ్యము నయ్యెడి రోజు మిత్రమా !

56.
బంగరు పంటభూములు అపారముగన్ బహుసంతసంబుతో
చెంగున పర్వులెత్తు మనజీవనదుల్ నిరతంబురెక్కలన్
కృంగగనేలదున్ను పలుకేవలురున్నను అన్నపూర్ణలో
ముంగిలియందుఉన్నరొకముద్ద లభించనివారు మిత్రమా !

57.
దేశములో జనించి మనదేశపు గాలినిబీల్చి తిండియీ
దేశపుదేభుజించియు విదేశపుశత్రవులతోనుకల్సి యీ
దేశపు క్షీణతన్ మదిన దీక్షబూనినఇంటిదొంగలున్
నాశనమొందజేసిన వినాశము తప్పును గాదె మిత్రమా !

58
రోజుకురోజుకున్ ముదురు రోగముతీరు సమాజమందునన్
వ్యాజము సొంతలాభమును రౌడి తనంబును మద్యపానమున్
మోజులుహెచ్చిపోయి పలుమోసములెన్నియొజేసినీతికిన్
బూజును పట్టజేసిరది పోవగజూడుమునీవె మిత్రమా !

59.
కరువులు దోపిడీలువరకట్నపు చావులు ఆత్మహత్యలున్
తరణులఅమ్మకాలు గతితప్పిన పాలన కుంభకోణముల్
తరువులకొట్టివేతలు అధర్ముల ఆటలు బాంబుమోతలున్
పెరిగిన మంత్రతంత్రములివేగద దేశమునందు మిత్రమా !

60.
రాజులు పోయిరందురు స్వరాజ్యము వచ్చెనటంచుకొందరున్
మోజుగమంత్రులయ్యి బహు మోదముతోడజనాళిదోచుచున్
భూజనులంతబాధపడిపోయియుకృంగినశించిపోయినన్
రాజులరీతిగాను నిట రాజ్యము నేలిరటయ్య మిత్రమా !

 61.
పరులనుమోసగించిపలుబాధలుగూర్చియుకొంపలెన్నొ ని
ష్కరణనుగూల్చియుండినవిషాదము పాలగు వారి శాపమే
భరతముపట్టునోయిపలుబాధలు
రోగములెన్నొపుట్టి ఆ
నరకపుయాతనల్ పడెదవు నమ్ముముమంచినెచేయిమిత్రమా!

62.
కోరినకన్యతో మనువుకూర్చగ లేదని ఆగ్రహించి పెం
పారిన కామమందునయపారముగా  తలదూర్చి మంచియో
నేరమొయంచు ఎంచక మనీషుల ధర్మమువీడి మూర్ఖుడౌ
క్రూరుడుతల్లిదండ్రులను కూల్చెను కాల్చియుచూడు మిత్రమా !

63.
మంచినికోరి కూతురువివాహముసేయగ కూలినాలనీ
ఎంచక పేదరాలు ధనమింతయు
కూర్చగ త్రాగుబోతుయౌ
వంచకుడైనభర్త తనబాధ్యతవీడి ధనంబు దొంగిలిన్
మంచితనంబుకంతకును మచ్చనుదెచ్చగదయ్య మిత్రమా !

64.
ప్రజలకు త్రాగుబోతులగు పాడలవాటునుగల్గజేసి ఆ
ప్రజలది డబ్బులాగు పరిపాలన సాగుచునున్ననేడు ఆ
ప్రజలకుదిక్కు ఏది?పలుబాధలు నిండిన పేదవారలన్
నిజముగబోవు నిత్యమునునీదయ జూపుచునుండి మిత్రమా !

65.
చట్టము చుట్టమాయె బలశాలురకీజదమందునేడు ఇ
క్కట్టులతల్లడిల్లి పలుబాధలతో బలహీనులెల్ల యి
ప్పట్టుననుండ చోద్యముగ వారల హక్కులు దిక్కులేనివై
అట్టుకకెక్కెదిక్కెవ్వరు?ఆర్తుల రక్షణచూడు మిత్రమా !

66.
మతకలహాలు మానవుల మారణహోమము మానభంగముల్
చితికిన పేదవారలను చిత్రములయ్యిన దొంగబేరముల్ వెతలనుకల్గగా నకిలివిత్తనముల్ బహుఔషధంబులున్
సతతము రాజకీయ ఫలసారమె సాగెనుఅన్ని మిత్రమా !

67.స్త్రీని పవిత్రమూర్తిగను చెల్లిగ తల్లిగ యెంచునట్టిదే
శాననునేడుకొందరును సంస్కృతి సభ్యత మంటగల్పు చం
దాననువేషమేసి మదితల్లడిల్లగనుమెల్గి జాతి దీ
మానన మంటగల్పిఅవమానము  చేసిరి చూడు మిత్రమా !

68.స్వాములుసేయుమోసముల సంగతి వార్తలు తెల్పుచున్న ఆ
స్వాములకాళ్లుమొక్కి దయచాలగ జూపనివేడుపెద్దలున్
పామరమూకలున్ చదువపారము నేర్చన వారు సైతమున్
ఏమనిచెప్పుదున్ జగతికెంతటి దుర్గతి పట్టె మిత్రమా !

69.మంత్రము యంత్రమంచును అమాయకులైనజనంబుచూడ యే
తంత్రములేకభూతమని దయ్యమనిన్నిల భూతలైద్యులన్
మంత్రముపేరజేరి ధనమంతయు బోవగ కృంగువారసన్
మంత్రము యంత్రతంత్రముల మాయలలో పడనీకు మిత్రమా !

70.కూతులు పుత్రులైన అధికుల్ మనకొద్దుగ ఇద్దరుండుటే
ప్రీతియుగల్గు చక్కగనుపెంచగ విద్యల నేర్చనట్లుగా
చేతనగున్ భలేగా పరిశీలనజేసి జనాళియంత యీ
నీతిని ఆచరించినను నెంతయొ మేలునుగల్గు మిత్రమా !

71.దైవసమానులై మనకు ధాత్రిన నిత్యము సంచరించు స
ద్భావనతోడ వైద్యులును ధర్మమటంచునునెంచిరోగులన్
కావగ శ్రద్ధజూపవలె కాసులకోసము ఆశజెందకన్
దేవునిబోలు వైద్యులది దేశము
ధన్యముగాదె మిత్రమా !

72.
కావలెనయ్య ఈధరణికంతట పచ్చని ఎన్నొచెట్లు వా
తావరణంబుయే కలుషితంబును నయ్యెను రోగబాధచే
భూవలయంబు తల్లడిల్లె పూర్తిగ దీనిని తెల్సిమెల్గినన్
భూవలయంబు యౌనుగద భూతల స్వర్గమురీతి మిత్రమా !

73.
ఎక్కడచూచినన్ హరితమే
మనకన్నులముందు నిల్వగా
మొక్కలునాటి మ్రానులప్రమోదము
తోడుతపెంచియున్న మా
కక్కరకొచ్చులోకమునకక్కరకొచ్చును ఓయి మానవా!
మక్కువతోడ మొక్కలనుమర్వక నాటియు పెంచు మిత్రమా !

74.
పగలును రేయి కష్టపడి బాధల కోర్చియు ఇల్లుచేరియున్
పొగలునుగ్రక్కు అన్నమున పులుసునుకల్పి భుజించి నేలపై
మగతగనిద్రబోవు సుఖమందరి కుండునె కష్టజీవి! ఈ

75
ధనమదిహెచ్చెనన్న బహు దర్పము హెచ్చును దానివల్లనే
మనమునబూనుమత్సరము మంచిని వీడిదురాగతంబు లౌ
పనులనుసేయబూనుగద బాధలు కల్గగజేయు మాకు ఆ
ధనమధికంబు నివ్వకనుతప్పక నీ దయ జూపు  మిత్రమా !

76.
ఏమియులేదుచెంత మరియే విధి నీపదపూజసేతు మా
కేమియుతోచదాయెగద కీలక మాయెధనంబునేడు నీ
ధామముచేరుచుండుటకు దర్శన భాగ్యము కోసమైన మా
కామితమెట్లుతీరు నినుకాంచెడు
మార్గమదేది? మిత్రమా !

77.
కలిమియులేకయున్నసరి కండ్లకుచూచెడి శక్తి నివ్వు ఏ
బలమునుయివ్వకున్న పలు బాధల తట్టుకొనంగశక్తినే
కలుగజేయు మేడలును కార్లు విమానములేమి వద్దు మా
చలనములోననిల్చి మను సాగగ జేయుమటయ్య మిత్రమా !

78.
ఊరనఊరె దేశముననున్నవి యెన్నియె ఎన్నిఊర్లుయో
ఊరన ఐకమత్యమునకున్నొక చిహ్నము శాంతి సౌఖ్యమిం
పారును పాడిపంటలు అపారము
వారలపాటలన్నియున్
ఏరులుకాల్వలై జనులకెంతయొ
హాయినిగూర్చు మిత్రమా !

79.
కిలకిలపక్షిరావములు కీచనుచుండెడిశబ్దతంత్రులున్
కలకలలాడుచేలు కలకాలము పచ్చగనుండుచెట్లు చె
క్కిలిగిలిగింతజేసి మనకెంతయొ హాయినిగూర్చుగాలి భూ
తలమున పల్లెలందు నిరతంబుగ నుండునటయ్య మిత్రమా !

80.
ఊరునుబాగు సేయవలె నున్నటువంటియు పెద్దలందరున్
పోరుకు సిద్ధమయ్యిననుపోవును
కీర్తి ప్రతిష్టలన్ని వ్యా
పారముగాదు పెత్తనము వచ్చు ప్రభుత్వ ధనంబుతోడుతన్
ఊరభివృద్ధియైమిగుల ఉన్నతికెక్కగ చూడు మిత్రమా !

81.
పొలములయందు హాలికుల పోకడలెన్నియొ చూడ చూడగా
హలములపట్టి పాటలను హర్షము తోడుత పాడుకొందురా
కలకలలాడునట్టి ముఖకాంతుల తోడను కాంతలంత స
త్ఫలితముకోరి సాగుదురు ధర్మము తప్పక యుండి మిత్రమా !

82.
అవిగో కొండలు వాటి ప్రక్కననె లోయల్ అందులేల్లెన్నొ క్రొ
త్తవికూపంబులనెన్నొ త్రవ్విరిగ తాదాత్మ్యంబునుంజెందు చు
న్నవి చెట్లెన్నియొ వాటిపై నిలిచియున్ నాట్యంబుతో పక్షులు
న్నవి భూమండలమందు వింతగనునానారీతులన్ మిత్రమా!

83.
రైతులు పత్తివేసి ఎదురైనటు వంటియు కష్టముల్ సదా
సైతురుగాని పత్తి జనసంపద టంచును ఎంచి దానితో
నేతురు బట్టలెన్నిటినొనేర్పుగ మానవజాతి కోసమే
ఖ్యాతి యె రైతు నేతపని కార్మిక చావులు చూడ మిత్రమా !

84.
తాతలనాటి నాగలి శతాబ్దుల
క్రిందటి ముల్లుగర్రనే
పాతవి పుచ్చిపోయి  తలపండిన పద్దతులేల కర్షకా
నూతనసాధనంబులు వినూత్న విధానములెన్నొవచ్చెనే
భూతలమందు వాటినిక పూర్తిగ
వాడుమటయ్య మిత్రమా !

85.
మానసమందుదల్చి అనుమానముసెందకఆలికమ్మలన్
పూనియునమ్మియున్ కొన ప్రభుత్వ మునిచ్చిన విత్తనాలనే
నానగబోయగబుర్రలవి నమ్మిన
బర్రెయు దన్నపోతునే
ఈనినయట్లునున్నదిగఏవిదియు
రైతులబాధ మిత్రమా !

86.
భీతియొకింతలేక బహుప్రేమను జూపి భుజాలపైననే
చేతులువేసి అన్నయని చేసెద మేలని మీరెదిక్కనీ
కోతలుకోసి మద్యమునుగూర్చియు డబ్బులుపంచి ఓట్లనే
నేతలు పొందజూసదరు నీతి యిదా మరిచూడ  మిత్రమా !

87.
కూతలుపెట్టి బల్లలను గుద్దుచు మైకులు పాడుసేయుచున్
చేతులనున్న పేపరులు చించుచు చేయుచు ముష్టి యుద్ధముల్
లోతుగజూడ చట్టసభలోనను విల్వలు మంటగల్పె డీ
చేతలు దేశఉన్నతికి చేటును దెచ్చును గాదె మిత్రమా !

88.
మముపాలింతురు భోగభాగ్య ములతో మాజీవితంబందు స్వ
ర్గముచూపింతురటంచు పాలకుల సత్కారంబుగావించి నె
య్యముతో ఓట్లిడి గద్దెపై నిలుప అయ్యా ఏమి లాభంబు? నీ
చముగా చేతికిచిప్పయిచ్చిరి గదా చాదస్తులై మిత్రమా !

89.
నరకములాంటి జీవితమునైన భరించుచు పండు పంటకున్
ధరయునులేక పెట్టుబడిదక్కక యున్నను మానవాళికిన్
మరవకతిండి పెట్టెడు అమాయక నిర్మల అన్నదాతకే
బిరుదమునివ్వరెవ్వరును విగ్రహ ముండదుచూడ  మిత్రమా !

90.
మాటలవేల కొన్నిసినిమాలను నాటికలందునున్న ఆ
పాటలువేషధారణలు భామల ముద్దులు కౌగలంతలీ
పూటన పిన్నలందునను పోకిరి ప్రేమను గల్గజేసెనా
నాటికి విద్యలున్ భవిత నాశము కాదను  చూడు మిత్రమా !

91
గురువు పవిత్ర గౌరవము గూల్చెడి రీతిగ నేడు కొందురున్
గురువులు మద్యపానమును కోవెల లౌ బడులందుకూడయున్
పరువునుదీయజచేసి తలంపులజ
తెచ్చిరి ఇంకకొందరున్
చెరుపునుగల్గగా వెలికి చేష్టలు
చేసిరటయ్య మిత్రమా !

92.
బిక్షంబెత్తుట ఎంతొ నీచమని
పూర్వికుల్ మనంబందునన్
భక్షింపంగను లేకపోయినసరే
బాధల్వడిన్ జీవింపగా
కాంక్షింపంగను సంతసంబు కలుగీ కాలంబునంజూడగా
బిక్షంబెత్తుట వృత్తియయ్యె గదరా పేచీలతో  మిత్రమా !

93.
అర్చనచేయునిత్యమును అన్య విధంబున తాను మంది మే
లోర్చక డాబు దర్పము ప్రలోభము
సంకుచిత స్వభావమున్
పేర్చియు హానిసేయగద పెక్కుగ
మానవతంబులేక నో
దార్చుగుణంబులేకను యిదామరి
అర్చన రీతి మిత్రమా !

94.
ఈ నరరూపరక్కసులుఇంపగు
నాట్యము చూడలేకనే
హానియు సేతురంచుయమయాతన  జెందియు  ప్రాణభీతిచే
కానలలోనికేగినను కాంచియు
పెద్ద విందుకోసమై
ప్రాణముతీసిరేయనుచు బాధల
మున్గెను కేకి మిత్రమా !

95.
నీతి నిజాయితీ గలిగి నిత్యము
నేను పరోపకారపుం
చేతలె ఆసరాగ పనిచేయుచు నున్నటువంటి నన్ను యీ
కోతులలాంటి మానవులు కొంచెపు బుద్ధితొ  నిందలేసిరే
నీతిని గల్గి యుండుటయు నేరమే?
ఏమిటొ చూడు మిత్రమా !

96.
విద్యకు విలువలేదుయిట విత్తము గల్గిననవాడె ఱేడు నీ
వధ్యయనంబుజేసి పరులాశ్రయ
మున్ బడుకంటె నీకికన్
సాధ్యముగాదు వేరొకటి సంఘమె
నాటక రంగమయ్యె ఏ
విద్యయునేర్చినన్ విలువ విత్తము
లేనిదెలేదు మిత్రమా !

97.
అచ్చమునీవజంత గుహలందననిల్చిన శిల్పకన్యనే
తెచ్చెదవేమి జ్ఞాపకమదేలనొ! శిల్పము చిత్రమౌటయే
మిచ్చెనొ ప్రేరణాత్మక కవిత్వము చిత్రము గీత నాట్యముల్
నచ్చిన ఆ అజంతగుహనందున
చూసితినోయి మిత్రమా !

98.
ఎచ్చటరా నిజాయితి?మరెచ్చట
నీతియు? ఈజగాన నీ
పిచ్చితనంబుగాని నిరుపేదల బాధలు నెవ్వరయ్యినన్
ఇచ్చగమాన్పజూపుదురె?ఎవ్విధమైనధనార్జనంబునే
మెచ్చియు నేతిబీరవలెమెల్గెడు వారలె చూడ మిత్రమా !


99.
గురువులు శిష్యులున్ కలిసి తీసియు పాఠశాల ఆ
వరణమునందుమొక్కలనుపాతియు శ్రద్ధగనీరు పోయగా
పెరిగిన చెట్లు చూసి బలుపెక్కిన దుష్టులు ఓర్వలేక  ఆ
తరువులకొట్టిరే ఎదలు తల్లడిలంగను చూడు మిత్రమా !

100.కలిమి బలంబు గల్గెనను గర్వము హెచ్చియు దుష్టమూకలే
బలమగునంచునెంచిపలుభంగుల పెంచగ తీవ్ర దు:ఖముల్
కలుగును వారికే చివరగానిక దుష్టులతోడనెవ్వడున్
చెలిమియుచేసియున్న పలుచింతలువారికెకల్గు మిత్రమా!

101.డబ్బులు డబ్బులంచు మరి డబ్బులకోసమె ఈ జగాననే బెబ్బులిలాంటి వారు తమ పెద్ద తనంబును కూడ వీడి త   బ్బిబ్బయి గడ్డి మేయుగద పేదల కొంపలుకూలి పోవగ డబ్బెప్రధానమయ్యెగద టక్కరి లోకముకంత మిత్రమా !

102.కార్మికుడన్న పెట్టుబడిగాడికి భృత్యుడుకాడు కాడిలన్
ఘర్మజసంబుదీసి మనకన్నియు కూర్చుచునుండువాడు ఈ
మర్మమునెత్తి చూపినది మాదినమే అదిమేదినంబు ఏ
ధర్మము దీనికంటె గలదందును
లోకమునందు  మిత్రమా !

103.కల్లలు కల్మషంబులునుకక్షలు
లేనటువంటి పిల్లలే
ఎల్లలులేనివారుమనసెంతయొ నిర్మలమైనవారు ఆ
మల్లెలలాంటివారు మన  మానసముల్ మురిపించువారు ఆ పిల్లలెదైవరూపులగు ప్రేమకు
పెన్నుధులోయి  మిత్రమా !

104విద్యయురాని వారలను వింతగజూతరు లోక జ్ఞానమున్
విద్యయులేకరాదు విలువెవ్వరు ఇవ్వరు నీతి జ్ఞానముల్
విద్యయులేక గల్గవు వివేకము
పెంచియుకొల్వునిచ్చు ఆ
విద్యయె జీవితంబునకు వెల్గులనిచ్చెడు దివ్వె మిత్రమా !
105.మంచికి నీవు ముందుపడు
మానవతంబుకు నీవు నిల్వు ఏ
వంచన సేయకుండు పగవారలకైన
ను మేలుచేసి నీ
మంచితనంబు చాటు మన మానవజాతిమేలుకొల్పగా
పంచుము జ్ఞానమున్ పరుల బాధలుతీర్చగపూను మిత్రమా !

106.ఉన్నతికెక్కి గడ్డితినియున్నను పాలనుయిచ్చి ధేనువుల్
సన్నుతికెక్కె వృక్షములు సర్వము నిచ్చుచు నీరుద్రావియున్
ఎన్నగ త్రోవజూపె నిటులెన్నియొ? మంచినిసేయరెందుకో
అన్నము తిన్న మానవులుఅందరు
నీచముగాదె  మిత్రమా !

107.న్యాయము నీతి భక్తి వినయం
బును బాల్యమునుండెయుండ ఆ
ప్యాయతగల్గజేయగల భారత
భాగవతంబు యింక రా
మాయణమందునున్న పలుమాన్యు
లగాధలు తల్లితండ్రిలే
బ్రాయమునుండె చెప్పవలె
బాధ్యతయంచునునెంచిమిత్రమా!

108.ఈ శతకంబునే చదివి యిందలిమంచిగ్రహించి నీవు యీ
దేశముబాగుకోసమయి దీక్ష వహించియు నిశ్చితంబుగన్
దోషముములున్నతెల్పుచును దొడ్డమనస్సున సాగిపోవ మా
ఆశఫలించునయ్య పరమాత్ముడు
బ్రోచును నిను మిత్రమా !


జంటకవి మిత్రులు::
ఇద్దరి పురుటి గడ్డ ఒక్కటే•••కాటెపల్లి గ్రామం
వీరిద్దరు పదవ తరగతి వరకు చదువుకున్నది
ఒకే బడి "జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల చాడ" నల్లగొండ జిల్లా. ప్రస్తుతం యాదాద్రి జిల్లా.
వీరు ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే
వారిలో సాహిత్య అభిలాష ఆసక్తి బీజాలు
అంకురించినాయి.
ఈ ఇద్దరు బాల్యమిత్రులు--నాగిళ్లబాబయ్యగుప్త
మచ్చ లక్ష్మయ్య. ఉన్నత పాఠశాల విద్యపిదప
వీరి జీవన గమనం మారింది.
   బాబయ్యగుప్త తల్లితండ్రులుకిరాణ దుకాణం
లో కూర్చుండి వృత్తిపని నేర్చుకొమ్నని బలవంత
పెట్టినారు కాని వృత్తిమీద ఆసక్తి చూపలేదు
మనసునందలి సాహిత్యాభిమాన ప్రేరణతో
జడ పెద్దల మాటలను లక్ష్యపెట్టక సారస్వత  పరిష                     
త్తు హైదరా బాదులోచేరి తెలుగు B.0.L పట్టా
1974సం.లోపొందిన పిదప తెలుగుపండితజ
శిక్షణానంతరం 1979సం.లో ప్రభుత్వ ప్రాథమి
కోన్నత పాఠశాల బాగాయత్ భువనగిరి లో
 జూనియర్ తెలుగు పండితునిగా ఉపాద్యాయ
వృత్తిలో జీవనయానం సాగింది.
      మచ్చ లక్ష్మయ్య కుటుంబపరిస్థితి అస్తవ్యస్త ముగా వుండటంవలన బ్రతుకుదెరువు
బొంబాయి (ముంబాయి)కివెళ్లి అక్కడ నేతకార్మి
కునిగా తమ వృత్తినికొనసాగించినాడుద. నేత
మగ్గాలనునడుపుతూ నేత బిడ్డల నిజపరిస్థితి
ని నెమరుకు తెచ్చుకొంటున్నాడు. సాహిత్యాభి
మాని కాబట్టితీరిక సమయాన్ని కూడ వృధా
కచేయక వివిధ గ్రంథాలను అధ్యయనంచేయ
టమే కాక వ్యాకరణం మీద పట్టు సాదించాడు.
అమరకోశం వంటి గ్రంథరాజాలను శ్రద్ధతో
చదివి సాహిత్యం మీదకొంతపట్టుసాధించిన
సాహితీ కృషీవలుడైనాడు.ఇంకా వైద్య సం
బంధ D.M.L.కామర్స్ లోడిప్లొమాపొందినాడు
తనలోనిసాహిత్య ప్రవాహాన్ని ఆపలేక బొంబా
యి లోనే1976సం.లోనేత పనివారలఇక్కట్ల
గురించి వారి ప్రతిభను తెలియ జేసేపద్యాలను
ఛందోబద్దంగా పాఠకులకు సులభంగా అర్థమ
య్యె రీతిలో చక్కని చిక్కనిశైలిలో వ్రాసి తన
ప్రతిభను చాటుకున్నాడు. కొంత కాలం పిదప
బొంబాయి నుంచి సొంత ఊరుకు చేరి కొన్ని
నెలల తరువాత భువనగిరిలో పాథాలోజికల్
లాబ్ పెట్టి వైద్య సేవలనందించినాడు.
భువనగిరిలో వుంటున్న బాల్యమిత్రులు
ఇద్దరు కలిసికున్నారు. యవదశలో ఇద్దరి
మిత్రుల స్నేహలతపల్లవించి మొగ్గదొడిగి పుష్పించి సాహితీ సౌరభాన్ని ప్రసరించింది.
వీరు సాహితీ సభలలో పాల్గొనడానికి ఉత్సు
కత కనపరచె వారు కాదు. తీరిక సమయాల్లో
సాహితీ ముచ్చట్లు చెప్పుకొనేవారు. వీరు శతకం
వ్రాయాలనే తలంపుతో సంవత్సరకాలం శ్రమిం
చి సామాజిక అధ్యాత్మికసందేశాత్మిక పద్యరచ
నలు చేసి మొదట "మిత్రశతకము "తదుపరి
"శ్రీ సాయినాథ శతకము"వేంకటేశ్వర శతకము"
రాసి అభిప్రాయాల కోసం సాహితీ మిత్రులకు
పంపినారు. ముద్రణ ప్రయత్నంలో వుండగా
చిన్న చిన్న అవంతకారణాలవల్ల ముద్రణ సమయం మార్చవలసివచ్చింది.
ఊహించని పరిణామం ! కరుణలేనికాలం
ఒకే సంవత్సరంలో (2015)ఆలోకనుంచి
వేరుచేసింది. కుటుంబాల్లో మిత్రబృందంలో
అభిమానుల్లోఆత్మీయుల్లో విషాదంనింపింది
జంట కవి మిత్రులు .......
మచ్చ లక్ష్మయ్య    నాగిళ్లబాబయ్యగుప్త
వారుభౌతికంగా లేకున్నా వారు రాసిన
శతకాలలో చిరంజీవులుగా వున్నారు.
వారి ఆశయ సాహితీ కృతులు వృధా
కాకుండా కవిమిత్రులజ్ఞాపకార్థ చిహ్నం
గా వుండి వారి ఆత్మలకు శాంతి
కలిగించునని భావిస్తున్నాను.
 ఈశతకాలు వీరిని చిరస్మరణీయులుగ
నిలిపి వారి కుటుంబాలకు ప్రశాంత
జీవనం ప్రసాదించాలని శారదమాతను
నిండు మనస్సుతో వేడుకుందాం.
జంట కవి మిత్రులకు అక్షర శ్రద్ధాంజలి
ఘటిస్తూ............
                          ఆత్మీయ
                 లెక్కల మల్లా రెడ్డి
                 విశ్రాంత ఉపాద్యాయుడు
                సైదాపురం యాదాద్రి.

మిత్రశతకము సమాప్తము చేసికొంత బాధ్యత తీర్చకున్నాను     
కృష్ణ మోహన్ గారికి;
కృతజ్ఞతలు. మీ పరిచయ బాగ్యం
మహా ఆనందం. మీ "లెక్కల"